వరిలో గట్లు చెక్కే యంత్రం

 


భారతదేశంలో వారి ప్రధానమైన ఆహార పంట. రైతులు సుమారు 44 మిలియన్ హెక్టార్లలో సాగుచేసి, 13 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. వరి సాగులో కూలీల కొరత తీవ్రంగా ఉంది.


 దీనివల్ల సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయం చేయడం కష్టమవుతుంది. అందుకుగాను రైతు యంత్రాలతో వ్యవసాయానికి మొగ్గు చూపవలసిన ఆవశ్యకత ఉంది. యాంత్రీకరణ వల్ల తక్కువ సమయంలో పని పూర్తవడమే కాకుండా తక్కువ ఖర్చుతో అవుతుంది. యంత్రాలు తక్కువ సమయంలో పనిని నాణ్యతతో చేయడం వల్ల పంటను ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకోవడంతో పాటు ఎక్కువ ఉత్పాదకతను పొందవచ్చు. యంత్రాలతో సరైన మోతాదులో ఎరువులు, రసాయన మందులు వేయడం వల్ల పంటకు అయ్యే ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. వారిలో క్షేత్ర కార్యకలాపాలను చేయడానికి వివిధ యంత్రాలు ఈ మధ్య అందుబాటులోకి వచ్చాయి. అందులో గట్లు చెక్కే యంత్రం ఒకటి. 

గట్లు చెక్కేయంత్రంలోని భాగాలు


ఇందులో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి


1. రోటరీ బ్లేడు.


2. రోటరీ డిస్కు


3. రోటరీ సిలిండరు.




పనిచేసే విధానం


ఈ యంత్రం ఒక్కసారి మూడు పనులను చేయగలదు. ఇది గట్టును చెక్కి, మట్టిని దృఢమైన గట్టుగా చేస్తుంది. ఇందులో ఉండే రోటరీ బ్లేడు గట్టును చెక్కి ఆ మట్టిని రోటరీ డిస్క్ మీదకు, సిలిండరు మీదకు తోస్తుంది. శంకు ఆకారంలో ఉండే రోటరీ డిస్క్ గట్టు పక్క భాగాన్ని, సిలిండరు ఆకారంలో ఉండే రోటరీ సిలిండరు గట్టు పై భాగాన్ని ప్లాస్టరింగ్ చేస్తాయి. ఈ విధంగా మూడు పనులు ఒకేసారి చేయడం వల్ల నాణ్యతతో కూడిన గట్లు తక్కువ కాలపరిమితిలో చేసుకోవచ్చు.




సామర్థ్యం


ఈ యంత్రం గంటకి 600మీ. నుంచి 900మీ. పొడవు గట్లను చెక్కి ప్లాస్టరింగ్ చేయగలదు. అదేవిధంగా నేల రకం, క్షేత్ర పరిమాణాన్ని బట్టి 3-5 ఎకరాల వరకు గట్లు చెక్కగలదు.


ఇంధన వినియోగం


ఈ యంత్రం ఉపయోగించుటకు గంటకు 5 నుంచి 6 లీటర్ల డీజిల్ అవసరం అవుతుంది.


ధర: యారోఫామ్స్ కంపెనీ ధర సుమారు రూ.3,05,000. రెడ్ ల్యాండ్స్ కంపెనీ ధర సుమారు రూ.4,00,000. 


ఉపయోగాలు


రైతువారీ పద్ధతిలో గట్లను చేసినట్లయితే ఒక ఎకరాకు 2 కూలీ రోజులు అవసరపడుతుంది. అందుకుగాను వివిధ ప్రాంతాల్లో కూలీ రేట్లను బట్టి ఎకరాకు రూ.1200 నుంచి రూ.1500 వరకు ఖర్చవుతుంది. అదే ఈ యంత్రం ఉపయోగించడం ద్వారా 15 నిమిషాలలో ఒక ఎకరా గట్లను చెక్కవచ్చు. దీనికయ్యే ఖర్చు ఒక ఎకరాకు రూ.500 నుంచి రూ.800 వరకు ఉంటుంది. నున్నటి నాణ్యమైన గట్లు వేయడం వల్ల రోటరీ సిలిండరు మట్టిని గట్టిగా నొక్కడం వల్ల వరి సాగులో ఎలుకల సమస్యను కొంతవరకు నివారించవచ్చు.


ఈ యంత్రం వాడకంలో మెలకువలు


దమ్ము చేసిన తర్వాత గట్లు వేస్తే గట్లు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కావున మొదటి దుక్కి అయిన తర్వాత పొలంలో నీరు పెట్టి ఈ యంత్రాన్ని ఉపయోగించుకోవాలి.



కస్టం హైరింగ్ ద్వారా యువతకు ఉపాధి


గ్రామీణ యువత ఈ యంత్రాన్ని అద్దెకు ఇచ్చుకోవడం ద్వారా మంచి లాభాలను ఆర్జించవచ్చు. ప్రస్తుతం ఈ యంత్రాన్ని అద్దెకు ఇవ్వడానికి గంటకు రూ.3000 చొప్పున తీసుకుంటున్నారు. అందులో స్థిర ఖర్చులు, అస్థిర ఖర్చులు కలిపి రూ.1700 తీసివేయగా రూ.1300 నికర ఆదాయం మిగులుతుంది. ఈ యంత్ర సేవలు రైతులకు అందుబాటులోకి తెచ్చినట్లయితే అటు రైతులు, ఇటు యువత మంచి లాభాలను పొందవచ్చు.




Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు