పత్తి ధరలకు లభిస్తున్న మద్దతు

 

18-10-2021

ఈ ఏడాది పంజాబ్లో పత్తి సేద్యం భారీగా విస్తరించినప్పటికీ కీటక సంక్రమణం వలన ఉత్పత్తి కొరవడుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. తద్వారా కనీస మద్దతు ధర ప్రతి క్వింటాలు రూ. 5925 అధిగమించి రూ. 7700 కు చేరింది. భారత పత్తి సంస్థ (సిసిఐ) మరియు భారత పత్తి సమాఖ్య లిమిటెడ్ (ఐసిఎఎల్) వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఏడాది ఉత్తరాది రాష్ట్రాలలో మొత్తం పత్తి సేద్యం 17.96 ల.హె. నుండి తగ్గి 16.99 ల.హె.కు పరిమితమైంది. ఇందులో పంజాబ్లో 52 వేల హెక్టార్లు వృద్ధి చెంది 3.03 ల.హె., హర్యాణాలో 49 వేల హెక్టార్లు తగ్గి 6.88 ల.హె., రాజస్తాన్లో 1 ల.హె. తగ్గి 7.08 ల.హె., గుజరాత్లో ఎగువ ప్రాంతంలో 3.44 ల.హె. మరియు దిగువ ప్రాంతంలో 6.64 ల.హె.కు విస్తరించింది.


ఈ ఏడాది ఉత్తర భారత్లోని పత్తి ఉత్పాదక రాష్ట్రాలలో ఉత్పత్తి గత ఏడాదిలో కనిష్ఠ స్థాయికి పడిపోయే అవకాశం కనిపిస్తున్నది. మూడు రాష్ట్రాలలో గత ఏడాది 62.67 లక్షల బేళ్ల సరుకు ఉత్పత్తి కాగా, ఈ ఏడాది పలు ఉత్పాదక ప్రాంతాలలో పింక్ బోల్వార్మ్ కీటక దాడి వలన ప్రపంచ వ్యాప్తంగా వస్త్ర పరిశ్రమ నిల్వలు పూర్తిగా హరించుకుపోయాయి. తాజాగా కొత్త నిల్వల కోసం అన్వేషిస్తున్నారు. తద్వారా పత్తి ధరలు ఇనుమడించినందున వస్త్రాల ధరలు కూడా రాణించగలవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చైనా నుండి భారీ డిమాండ్ నెలకొన్నందున కూడా ధరలకు మద్దతు లభిస్తున్నది. ఎందుకనగా తగ్గిన ఉత్పత్తితో పాటు దేశీయ జిన్నింగ్ పరిశ్రమలు భారీగా సరుకు కొనుగోలుకు ఆసక్తి చూపడమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటి వరకు దిగ్గజ స్టాకిస్టులు సరుకు కొనుగోలు చేస్తున్నారు.


పత్తి దిగుబడులు పెంచాల్సిన ఆవశ్యకత


భారత పత్తి సంస్థ (సిసిఐ) చే ఇటీవల నిర్వహించిన వెబినార్లో పత్తి పరిశ్రమకు గడిచిన కొన్ని సంవత్సరాలుగా భారత్లో పత్తి దిగుబడులు కొరతను ఎదుర్కొంటున్నట్లు సిసిఐ పేర్కొన్నది. ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, ఇజ్రాయెల్, మెక్సికో, టర్కీ లాంటి దేశాలలో ప్రతి హెక్టారు దిగుబడి 1500 కిలోలు లభ్యమవుతుండగా భారత్లో కేవలం 530 కిలోలు మాత్రమే ఉంది. దేశ స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో దేశవ్యాప్తంగా 43 ల.హె.లో పత్తి సేద్యం చేపట్టబడుతుండగా ప్రతి హెక్టారు దిగుబడి 70 కిలోలు కాగా, ప్రస్తుతం 1.33 కోట్ల హెక్టార్ల నుండి 500 కిలోల దిగుబడి సాధ్యమైంది. దాదాపు దేశవ్యాప్తంగా 80 లక్షల మంది రైతులు పత్తి సేద్యం చేపడుతున్నారు. ఎదుగూ బొదుగు లేని ఉత్పత్తి, శరవేగంతో పెరుగుతున్న వినియోగం వలన ఉత్పత్తికి ధీటుగా వినియోగం కూడా పోటీ పడుతూ వినియోగం 3.50-3.60 కోట్ల బేళ్లకు చేరింది. ఇలాంటి పరిస్థితులలో పత్తి పంట దిగుబడులు పెంచేందుకు దృష్టి సారించడం అత్యంత ఆవశ్యకత ఏర్పడింది.


ఆదిలాబాద్లో పత్తి కొనుగోళ్లు


 ఆదిలాబాద్ జిల్లాలో అక్టోబర్ 20 నుండి పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నట్లు రైతులు, వ్యాపారులు మరియు భారత పత్తి సంస్థ (సిసిఐ) అధికారులతో నిర్వహించిన ఒక సమావేశంలో జిల్లా కలెక్టర్ సిత్తా పట్నాయక్ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత సీజన్లో 3.90 లక్షల ఎకరాలలో పత్తి సేద్యం చేపట్టగా ఉత్పత్తి సుమారు 27 లక్షల క్వింటాళ్ల సరుకు దిగుబడి కాగలదని ఆయన అన్నారు. ఇందుకోసం రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు విస్తృతంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కనీస మద్దతు ధరతో పత్తి కొనుగోలు చేయాలని సిసిఐ అధికారులను ఆయన కోరారు. అంతేకాకుండా, వ్యాపారులు కూడా ఇదే ధరతో కొనుగోలు చేయాలని సూచించారు. కుండపోత వర్షాలు కురిసినందున పత్తి పంటకు నష్టం వాటిల్లిందని జిల్లాలోని రైతులు తమ ఆవేదన వెలిబుచ్చారు. ఈసారి రైతులకు లాభసాటి ధరలు గిట్టుబాటయ్యే అవకాశం ఉంది. ఎందుకనగా ప్రస్తుత సీజన్ కోసం మద్దతు ధర ప్రతి క్వింటాలు రూ. 5885 నుండి పెరిగి 6025 కు పెరగడమే ఇందుకు నిదర్శనం. అయితే, వ్యాపారులు మద్దతు ధర కంటే కూడా అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తున్నది. ఈసారి మార్కెట్లో ప్రతి క్వింటాలు రూ. 7000 పలుకుతుండడమే ఇందుకు ప్రధాన కారణం. అంతేకాకుండా పాత సరుకు నిల్వలు కూడా హరించుకుపోయాయి. అంతర్జాతీయ విపణిలో ధర ఇనుమడిస్తున్నందున దేశీయ మిల్లుల నుండి ఆదరణ నెలకొన్నది.


భారత్ నుండి ఎగుమతులు తగ్గే అవకాశం

ప్రపంచంలో అతిపెద్ద పత్తి ఉత్పాదక దేశమైన భారత్లో పెరుగుతున్న పత్తి వినియోగం, అడుగంటిన మిగులు నిల్వలతో ఎగుమతులు కుంటుపడే అవకాశం కనిపిస్తున్నది. దేశంలో మిగులు నిల్వలు గత ఏడాదితో పోలిస్తే దాదాపు 50 శాతం మేర తగ్గినందున సరఫరా కుంటుపడుతోంది. 2021-22 లో పత్తి ఎగుమతులు ముందు సంవత్సరంతో పోలిస్తే 36 శాతం తగ్గి 50 లక్షల బేళ్లకు పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2020-21 లో ఎగుమతులు 78 లక్షల బేళ్లకు చేరాయి. ఇది గడిచిన ఎనిమిదేళ్లలో అత్యంత గరిష్ఠమని పేర్కొనబడుచున్నది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా పత్తి ధరలకు మద్దతు లభించవచ్చని భావిస్తున్నారు. ప్రముఖ పత్తి వినియోగ దేశమైన చైనా భారీ డిమాండ్ నెలకొన్నందున మొదటి నుండీ ధరలు గడిచిన పది సంవత్సరాల గరిష్ఠాన్ని తాకాయి. 2020-21 కోసం ప్రభుత్వ ఏజెన్సీ అయిన భారత పత్తి సంస్థ (సిసిఐ) చే వేర్ హౌస్ల నుండి ఎడతెరిపి లేకుండా చేపట్టిన అమ్మకాలు, ప్రపంచ స్థాయిలో భారత పత్తి ధరలు చౌకగా ఉన్నందున భారీ ఎగుమతులు నమోదయ్యాయి. అయితే, ఈ ఏడాది అక్టోబర్ 1 నుండి ప్రారంభమైన ప్రస్తుత సీజన్లో పత్తి నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1.25 కోట్ల బేళ్ల నుండి తగ్గి 65 లక్షల బేళ్లకు పరిమితమయ్యాయి. ఈ ఏడాది మద్దతు ధరలతో పోలిస్తే అధిక ధర పలికే అవకాశం ఉన్నందున ప్రభుత్వ కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. ఈ ప్రభావం ఎగుమతులపై పొడసూపగలదు. మిల్లుల నుండి నెలకొన్న భారీ డిమాండ్ మరియు ప్రపంచ వ్యాప్తంగా ధరలు బలోపేతం చెందినందున దేశీయ మార్కెట్లో గత వారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం ఎగుమతుల కోసంనాణ్యమైన సరుకు అందుబాటులో లేదు. గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కురిసిన కుండపోత వర్షాలకు ఉత్పత్తి తగ్గనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. కావున ధరలు కుంగుబాట పట్టే అవకాశం లేదు. నాణ్యమైన సరుకు అందుబాటులోకి రావడానికి మరో నెల రోజులు వేచివుండాలి.


ప్రత్యేక సూచన


భవిష్యత్తులో భారత పత్తి ధర రూ. 10,000 చేరగలదని అంచనా...

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు