రబీ వరిలో విత్తనాల ఎంపిక - దిగుబడి పెంచే సూచనలు



09-10-2021

తెలుగు రాష్ట్రాల్లో 60 శాతానికి పైగా రైతాంగం వరి పంటనే ప్రధాన ఖరీఫ్, రబీలలో పండిస్తారు. ఖరీఫ్ తో పోల్చితే రబీలో నీటివనరులు తక్కువగా ఉండటం, నిర్దిష్ట వాతావరణ పరిస్థితులుండటం, స్వల్పకాలంలోనే అధిక దిగుబడులు సాధించడం జరుగుతుంది. ఒక వరి రకం పూర్తిస్థాయి దిగుబడులు సాధించే అవకాశం రబీలోనే ఉంటుంది. రబీలో 50-60 బస్తాల దిగుబడులు సాధిస్తున్నప్పటికీ సకాలంలో సరైన యాజమాన్య పద్ధతులను అవలంబిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు ఏ రకంగా సాధించవచ్చో తెలుసుకుందాం.


నేల తయారీ


గత పంటకాలం (ఖరీఫ్) లో వేసిన వరి లేదా ఇతర పంటల అవశేషాలు వల్ల రబీ వరిసాగులో మొదటి సమస్య తలెత్తుతుంది. ఖరీఫ్ లో సాగుచేసిన వరి రకం కేళీలు రావడం, ప్రత్యేకంగా రబీలో చలి వాతావరణం వల్ల పంట అవశేషాలు సరిగా కుళ్లకపోవడం వల్ల తలెత్తే జింకుధాతు లోపాలు వంటివి రాకుండా ఉండాలంటే నేల తయారీ చాలా కీలకమైన యాజమాన్య చర్య. దమ్ముకు, దమ్ముకు మధ్య వారం, పది రోజుల వ్యవధిలో కనీసం 3-4 దఫాలుగా మురగదమ్ము చేసుకోవాలి. పొలంలో ఎత్తు పల్లాలు లేకుండా సమాంతరంగా చదును చేయకపోతే రబీలో లభ్యమయ్యే కొద్దిపాటి నీటివనరులు వృథా అవ్వడమే కాకుండా కలుపు సమస్య అధికమవుతుంది. అందువల్ల నేల తయారీలో అటు నారుమడైనా, ప్రధాన పొలమైనా జాగ్రత్తగా చేసుకోవాలి.


రకాల ఎంపికే కీలకం: 


వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన నీటి లభ్యతను బట్టి, చీడపీడలను దృష్టిలో పెట్టుకుని మన ప్రాంతానికి అనువైన అధిక దిగుబడులనిచ్చే స్వల్పకాలిక వరి రకాలను మాత్రమే ఎంచుకోవాలి. రబీలో ఉండే చలిని, మార్చి- ఏప్రిల్ నెలల్లో వచ్చే ఎండను తట్టుకుని ముఖ్యంగా రబీలో ప్రస్ఫుటంగా కనిపించే అగ్గితెగులు, దోమపోటును తట్టుకునే రకాలను ఎంచుకోవాలి. నేరుగా విత్తి సాగుచేసే రైతులు వేరువ్యవస్థ బలంగా, కాండం దృఢంగా ఉండి పడిపోని రకాలను ఎంచుకోవాలి. సాధ్యమైనంత వరకు 120-130 రోజుల కాలపరిమితిగల రకాలను మాత్రమే రబీలో సాగు చేయాలి.


సాధారణ రబీ నాట్లకు: 

శ్రీధృతి (MTU-1121), IR-64, తరంగిణి (MTU-1156), చంద్ర (MTU-1153), కాటన్ దొర సన్నా (MTU-1010), ప్రభాత్, నెల్లూరి మసూరి, రాశి, నంద్యాల సన్నాలు, స్వర్ణముఖి, పుష్కల (RGL-2624), శ్రీసత్య (RGL -1880) వంటి రకాలు ఆంధ్రా ప్రాంతంలోనూ, జగిత్యాల సన్నాలు, బతుకమ్మ, కూనారం సన్నాలు, తెలంగాణ సోనా వంటి తెలంగాణ రకాలతో పాటు చిరుసంచుల ప్రదర్శనలో ఉన్న MTU-1290, NLR-3238, MTU-1282, BPT-2848,MTU-1311 రకాలు సాగు చేసుకోవచ్చు. 

చౌడు భూముల్లో

 నెల్లూరి మసూరి, సోమశిల రకాలు రబీలో ఆలస్యంగా నాటేందుకు, కాటన్ దొర సన్నాలు, IR-64, చంద్ర, ప్రద్యుమ్న, పుష్కల, సత్య, శ్వేత, తరంగిణి రకాలు, దోమ ఆశించే ప్రాంతాల్లో... శ్రీధృతి, చంద్ర, దీప్తి, కాటన్ దొర సన్నాలు, విజేత, తరంగిణి రకాలు అనువైనవి. 



నారుమడి యాజమాన్యం:


 ఆరోగ్యవంతమైన నారుమడి తయారవ్వాలంటే మంచి నేల తయారీతో పాటు నారు ఆరోగ్యంగా పెరగడానికి కావాల్సిన వసతులు కల్పించాలి. ప్రస్తుత వాతావరణం, నేలల ఆరోగ్య రీత్యా విత్తనశుద్ధి తప్పక పాటించాలి. పొడి విత్తన శుద్ధి అయితే కిలో విత్తనానికి 3 గ్రా. కార్బెండాజిమ్, తడి విత్తనశుద్ధి అయితే 1గ్రా. కార్బెండాజిమ్ మందుతో తప్పనిసరిగా శుద్ధి చేసుకోవాలి. రబీలో మొలకశాతం తక్కువగా వస్తుంది. గనుక చలి వాతావరణం దృష్ట్యా విత్తనాలను 24 గంటలు నీటిలో నానబెట్టి తర్వాత 24 గంటలు మండెకట్టి పూర్తిగా మొలకవచ్చిన విత్తనాలను నారుమడిలో చల్లుకోవాలి. ఒకవేళ ఖరీఫ్ లో పండించిన వరి విత్తనాలను రబీలో వాడుకోవాలంటే తప్పనిసరిగా 6.3 మి.లీ. గాడ నత్రికామం లీటరు నీటికి కలిపిన ద్రావణంలో విత్తనాల నుంచి నిద్రావస్థను తొలగించుకోవాలి. చలి ఎక్కువగా ఉండే రబీలో దృఢమైన, ఆరోగ్యవంతమైన నారు పొందాలంటే ప్రతి సెంటు నారుమడికి ఆఖరి దుక్కిలో 20 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల నత్రజని, 2 కిలోల భాస్వరం, ఒక కిలో పొటాషియం నిచ్చే ఎరువులను వేసుకోవాలి. రబీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటే భాస్వరం ఎరువును రెట్టింపు వేసుకోవాలి. నారు తొలిదశలో చలి తట్టుకోవడానికి ఎండుగడ్డి లేదా గోనె సంచులతో మొలక పూర్తిగా వచ్చేవరకు కప్పుకోవాలి. అడపాదడపా సాగునీరు రాత్రిళ్ళు పెట్టి పగలు తీసివేయాలి. రబీలో ముదురునారు నాటకుండా 15-25 రోజుల్లోపు నారును సకాలంలో నాటుకుంటే అధిక దిగుబడులు పొందవచ్చు. అవసరాన్ని బట్టి నారు తీతకు వారం, పది రోజుల ముందు 2 కిలోల నత్రజనినిచ్చే ఎరువులు గాని, పురుగుల ఉధృతిని అరికట్టేందుకు కార్బోప్యూరాన్ గుళికలు గాని వేసుకోవాలి.


వరినాట్లు, ఎరువుల యాజమాన్యం: 


వరినాట్లు వేసేముందు నేల తయారీ బాగా చేసుకొని ఎత్తుపల్లాలు లేకుండా చదును చేయాలి. గట్ల చుట్టూ ఉండే గడ్డిని చెక్కుకోవాలి. నీరు పెట్టడానికి, తీయడానికి అనుకూలంగా ఉండేలా జాగ్రత్త పడాలి. చదరపు మీటరుకు 44 మూనలు తక్కువ కాకుండా లేత నారును 5 సెం.మీ. లోతులోనే నాటాలి. ప్రతి రెండు మీటర్ల నాట్లకు 20-25 సెం.మీ. కాలిబాటలు తప్పనిసరిగా విడిచిపెట్టాలి. ఒకవేళ ముదురునారు వేయాల్సి వస్తే చ.మీ.కు 50-55 మూనలు - వేసుకోవాలి. మూనకు 4-5 మొక్కలుండేలా నాటాలి. భూసారాన్ని బట్టి ఎరువులు వేయాలి. పూర్తిగా రసాయన ఎరువుల మీదనే ఆధారపడకుండా వీలైనంత మేరకు సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు, వర్మికంపోస్టు, కోళ్లు-మేకల ఎరువులను కలిపి సమగ్ర పోషక యాజమాన్యం పాటించడం వల్ల నేల ఆరోగ్యంతో పాటు పర్యావరణ కాలుష్యం నివారించవచ్చు. రబీలో చలి ఎక్కువగా ఉంటుంది గనుక భాస్వరం ఎరువును రెట్టింపు మోతాదు. వేయాలి. భూసార పరీక్షల ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నత్రజనినిచ్చే ఎరువులను 48-72 కిలోలు, భాస్వరం 38-42 కిలోలు, పొటాష్ నిచ్చే ఎరువులను 24-32 కిలోల చొప్పున ఎకరాకు వేసుకోవాలి. రబీలో తప్పనిసరిగా జింకు ధాతు లోప నివారణకు 20 కిలోల జింకు సల్ఫేటును ఆఖరి దమ్ములో గాని, నాట్లు వేసేముందు గాని వేయాలి. చలి తీవ్రత ఎక్కువగా ఉంటే 30-50 శాతం భాస్వరం ఎరువులను అదనంగా వేయాలి. పూర్తి భాస్వరం, సగం పొటాష్ ఎరువులను ఆఖరి దమ్ములో లేదా నాట్లు వేసేటప్పుడు వేయాలి. నత్రజని ఎరువును మాత్రం 3 సమభాగాలుగా చేసి నాట్లు వేసేటప్పుడు, పిలక దశలో అంటే 20-25 రోజులప్పుడు, మూడో భాగం నత్రజనిని మిగతా సగం పొటాష్ ఎరువుతో కలిపి చిరుపొట్ట దశలో అంటే 50-60 రోజులప్పుడు వేయాలి. రబీలో నారుమడి దశ నుంచి పిలక తొడిగే వరకు జింకు ధాతు లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ జింకు లోపం వల్ల పైరు సరిగా ఎదగక, ఎరువులు ఎంత వేసినప్పటికీ ఎదగక కురచగా ఉండి పిలకలు తక్కువగా పుడతాయి. దీని నివారణకు లీటరు నీటికి 2గ్రా. జింకు సల్ఫేటును వారం పది రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి. మెట్ట ప్రాంతాల్లో ముఖ్యంగా నారుమడి దశలో లేత ఆకులు తెల్లగా మారి ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకులు నిర్జీవమైతే ఇనుపధాతు లోపంగా గుర్తించి 20. అన్నభేది + 2 గ్రా. నిమ్మఉప్పు చొప్పున లీటరు నీటికి కలిపి ఆకులు సాధారణ స్థాయికి మారే వరకు వారం పది రోజుల వ్యవధిలో 3-4సార్లు పిచికారి చేయాలి.


సకాలంలో కలుపు నివారణతో అధిక దిగుబడులు




రబీలో నీటిలభ్యత తక్కువగా ఉంటుంది గనుక నేల తయారీలో అశ్రద్ధ చేసినా నాట్లు వేసిన నాలుగైదు రోజుల నుంచి కలుపు ఉధృతి పెరిగిపోతుంది. ఖరీఫ్ తో పోల్చితే రబీలో వరి దిగుబడులు ఎక్కువగా ఉంటాయి గనుక కలుపును సకాలంలో సరైన రీతిలో అరికడితే అధిక దిగుబడులు సాధించవచ్చు. పొలం గట్లమీద, సాగునీటి కాలువల్లో కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త పడితే తెగుళ్ల వ్యాప్తిని చాలా వరకు అరికట్టవచ్చు. సాధ్యమైనంత వరకు కలుపు తక్కువగా ఉన్నప్పుడే కూలీలతో కలుపు తీయించాలి. కలుపు రాకుండా పొలంలో తగినంత నీటిని నిలగట్టాలి. కలుపు ఉధృతి పెరుగుతున్నప్పుడు అవసరాన్ని బట్టి రసాయన మందులను వాడుకోవాలి. నారుమడి దశలో విత్తిన వారం రోజుల్లో కలుపు నివారణకు 1.5 లీటర్ల బ్యూటాక్లోర్ లేదా విత్తిన 14-15 రోజుల్లో కలుపు నివారణకు 400 మి.లీ. సైహలోపాప్ బ్యుటైల్ లేదా 20-25 రోజులప్పుడైతే 400 గ్రా. 2, 4-డి సోడియం సాల్ను 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరా నారుమడికి పిచికారి చేసి కలుపు నివారించుకోవచ్చు.


ఎలుకల యాజమాన్యం




 పిలకదశ నుంచి పదిరోజుల వ్యవధిలో చిరుపొట్టదశ వచ్చేవరకు బ్రోమోడయోలిన్ ఎరలను ఎకరాకు 4-5 చొప్పున వాడాలి. ఎలుకల ఉధృతి ఎక్కువగా ఉంటే పంట కాలంలో ఒక్కసారి జింక్ఫాస్పైడ్ మందును వాడాలి. ఎలుకలు పాడుచేసిన చేల నుంచి పిలకలను ఏరి దూరంగా పారవేయాలి లేనిచో ఎలుకల దాడి పెరగడమే కాకుండా పొలంలో తెగుళ్లు, దోమపోటు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఒక ప్రణాళికా బద్ధంగా సామూహిక ఎలుకల నివారణ చర్యలను గ్రామం ఒక యూనిట్గా తీసుకుని చేపడితే ఎలుకలను సమర్థంగా అరికట్టవచ్చు.


రబీ వరిలో సస్యరక్షణ:



 రబీలో చీడపీడలను తట్టుకునే మేలైన వరి రకాలను ఎంచుకోవాలి. కాలిబాటలు తీయటం, పురుగు, తెగుళ్లు నష్టపరిమితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ నష్టస్థాయిని బట్టి నివారణ చర్యలు సకాలంలో సరైన మందును వినియోగించి నివారించుకోవాలి. నారుమడి దశలో ప్రధానంగా కాండం తొలుచు పురుగు, తామర పురుగులు, దోమ పోటుతో పాటు అగ్గితెగులు, కాండంకుళ్లు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. అదే పిలక దశ నుంచి పోటాకు దశ వరకు ఆకుముడుత, కాండం తొలుచు పురుగు, తాటాకు తెగులు, సుడిదోమ, తామర పురుగులు, అగ్గితెగులు, పాముపొడ, ఎండాకు తెగుళ్లు ఆశిస్తాయి. పూత దశ నుంచి ఈనిక దశ వరకు కంకినల్లి, ఆకునల్లి, కంపునల్లి వంటి పురుగులు, మెడవిరుపు, మానిపండు, పొట్టకుళ్లు, పొడతెగులు ఆశిస్తాయి.


తెగుళ్ల నివారణలో ముందు చర్యగా విత్తనశుద్ధి తప్పనిసరిగా పాటించాలి. సత్రజని ఎరువులను సిఫారసు మేరకు వాడి, గట్లపైనున్న, చేలల్లోని కలుపును నిర్మూలిస్తే తెగుళ్ల వ్యాప్తిని చాలా వరకు అరికట్టవచ్చు.



యాసంగి వరి రకాలు


తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో దాదాపు కోటి ఎకరాల్లో వరి పంటను 'సాగుచేస్తున్నారు. ఈ పంటలో దాదాపు వంద శాతం దొడ్డు రకాలనే సాగుచేయడం గమనార్హం. యాసంగిలో సాగుకు బతుకమ్మ, జగిత్యాల రైస్-1, తెలంగాణ వరి-3, కూనారం సన్నాలు, తెల్లహంస, తెలంగాణ సోన, కాటన్ దొర సన్నాలు, శీతల్ వరి రకాలు అనువైనవి.

రకాల గుణగణాలు: 


బతుకమ్మ (JGL-18047): ఎకరాకు 28-32 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. చలిని తట్టుకోవడంతో పాటు వరిదోమను కొంతవరకు తట్టుకొంటుంది. అధిక దిగుబడినిస్తుంది. MTU-1010ని పోలిన దొడ్డుగింజ రకం.

జగిత్యాల రైస్-1 (JGL-24423): ఎకరాకు 30-35 క్వింటాళ్ల
దిగుబడినిస్తుంది. గింజ రాలదు, పంట పడిపోదు, సుడిదోమను కొంతవరకు తట్టుకుంటుంది. అదేవిధంగా చలిని, చౌడును తట్టుకొంటూ అధిక దిగుబడినిచ్చే వరి వంగడం. మెడవిరుపును తట్టుకోదు.

తెలంగాణ వరి-3 (JGL-21078): 120 రోజుల పంటకాలం కలిగి ఎకరాకు 30-32 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఉల్లికోడును, అగ్గితెగులును సమర్థంగా తట్టుకొని అధిక దిగుబడినిచ్చే దొడ్డుగింజ నూతన వంగడం.

కూనారం సన్నాలు: (KNM-118): ఎకరాకు 28-32 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. చలిని తట్టుకోవడంతో పాటు సుడిదోమను కొంతవరకు తట్టుకుంటుంది.

తెల్లహంస: (RNR 10754): ఎకరాకు 20-25 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. చలిని తట్టుకుంటుంది. అగ్గితెగులును తట్టుకోలేదు.

తెలంగాణ సోనా (RNR-15048): ఎకరాకు 26-28 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. అగ్గితెగులును సమర్థంగా తట్టుకుంటుంది. తక్కువ నూక శాతంతో (68-70 శాతం బియ్యం) అన్నం నాణ్యత కలిగి ఉంటుంది. కాండం తొలుచు పురుగు అధికంగా ఆశిస్తుంది.

కాటన్ దొర సన్నాలు (MTU-1010): చలిని తట్టుకొని అధిక దిగుబడినిచ్చే దొడ్డుగింజ రకం. ఎకరాకు 28-30 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. 

శీతల్: చలిని బాగా తట్టుకొని అధిక దిగుబడినిచ్చే దొడ్డుగింజ రకం. కొంతవరకు అగ్గితెగులును కూడా తట్టుకొంటుంది, ఎకరాకు 28-30 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది.











Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు