పత్తి పదివేలు

 

2-01-2022

నాణ్యమైన పత్తి ఉంటే చాలు.. వ్యాపారులు పోటీ పడి కొంటున్నారు. ఇప్పటికే క్వింటాలుకు రూ.10 వేలకు పైగా పలుకుతోంది. ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది. దేశంలో పత్తి ఉత్పత్తి పడిపోవడంతో డిమాండు పెరిగిందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. 


రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 20 లక్షల బేళ్ల దూది లభిస్తుందని తొలకరిలో అంచనా వేస్తే.. ఇప్పుడది 8 నుంచి 9 లక్షల బేళ్లే వచ్చేలా ఉంది. దేశీయంగానూ 3.60 కోట్ల బేళ్లు అంచనా వేయగా.. 3 కోట్ల బేళ్లు రావడమూ కష్టంగానే ఉంది. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనుకున్న భూముల్లోనూ భారీ వర్షాలు, వరదలు, గులాబీ పురుగు ప్రభావంతో మూడు, నాలుగు క్వింటాళ్లు కూడా వచ్చేలా లేదు. ఈ పరిస్థితి వస్తుందని వ్యాపారులు మొదట్లోనే భావించినా.. మరీ ఇంత దారుణంగా దిగుబడి పడిపో తుందని మాత్రం ఊహించలేకపోయారు.


పత్తి అధికంగా పండించే గుంటూరు, కర్నూలు, ప్రకాశం, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఉత్పత్తి గణనీయంగా తగ్గేలా కనిపిస్తోంది. గుంటూరు ప్రాంతంలో గతేడాది 9 లక్షల బేళ్లు రాగా.. ఈ ఏడాది గరిష్ఠంగా 4 లక్షల బేళ్లే వచ్చేలా ఉంది. కర్నూలు జిల్లాలో గత డాది 6 లక్షల బేళ్ల ఉత్పత్తి రాగా.. ఈ సారి 5 లక్షల బేళ్లకు పరిమితం కానుందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ధరలు పెరిగే అవకాశం ఉంది.


కొంతే ప్రయోజనం


పత్తికి తొలకరి నుంచి మంచి ధరలే ఉన్నాయి. క్వింటాలు రూ.7 వేల నుంచి రూ.8 వేల మధ్య పలి కింది. రైతులూ తొలి తీత పత్తిని మంచి ధరకే అమ్ముకున్నారు. ఆ తర్వాత భారీ వర్షాలతో పత్తి తడిసింది. దీంతో క్వింటాలు రూ.4 వేల నుంచి రూ. 6 వేల మధ్యకు పడిపోయింది. తేమ పత్తి ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేక... అధిక రైతులు తక్కువ ధరకే అమ్ముకున్నారు. ఈ లోగా గులాబీ పురుగు దాడి తీవ్రం కావడంతో నాణ్యత తగ్గిపోయింది. ప్రస్తుతం పత్తి నాణ్యంగా ఉంటే రూ.9 వేల-రూ.10 వేల వరకు, తక్కువ నాణ్యత ఉంటే రూ.8 వేల-రూ.9 వేల వరకు పోతోంది.


అంతర్జాతీయంగా డిమాండ్


పత్తికి ఈ ఏడాది అంతర్జాతీయంగానూ డిమాండు ఉంది. అమెరికా ఫ్యూచర్ మార్కెట్లోనూ ధరలు నిలకడగానే సాగుతున్నాయి. కొరత ఏర్పడుతుందనే ఆలోచనతో.. దేశంలోని బహుళజాతి సంస్థలు అధిక మొత్తంలో కొని నిల్వ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ పోటీని తట్టుకోవడం దేశీయ సంస్థలకు ఇబ్బందికరంగా తయారైంది. భారత పత్తి సంస్థ(సీసీఐ) కొనుగోలు చేసి ఉంటే.. నెమ్మదిగా మార్కెట్లోకి నిల్వలను విడుదల చేసేది. ఈ ఏడాది సీసీఐ కొనుగోలు లేదు


• ప్రస్తుతం 29 మి.మీ పింజ ఉండే క్యాండీ (356 కిలోల) దూది ధర రూ.71 వేల నుంచి రూ.72 వేల వరకు ఉందని ఆంధ్రప్రదేశ్ పత్తి వ్యాపారుల సంఘం కార్యదర్శి వెంకట్రామిరెడ్డి చెప్పారు


• ఈ స్థాయిలో పత్తి ఉత్పత్తి పడిపోతుందని ఊహించలేదని అఖిల భారత పత్తి విత్తన వ్యాపారుల సంఘం ఉపాధ్యక్షుడు వీరనారాయణ చెప్పారు. పత్తి ఉత్పత్తి తగ్గడంతో గింజకు డిమాండ్ పెరిగి.. క్వింటాలు రూ.3,600 వరకు చేరాయన్నారు. 







Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు