చీడపీడల నివారణకు అనాదిగా రైతులు రసాయన పురుగుమందులు వాడుతున్నారు. కాని గత కొన్నేళ్లుగా రసాయనాలపై అధికంగా ఆధారపడటం వల్ల సేద్యపు ఖర్చులు పెరగడమే కాకుండా ఆహారోత్పత్తుల్లో విషపు అవశేషాలు, వాతావరణ కాలుష్యం, శత్రుపురుగుల్లో పురుగుమందులను తట్టుకునే తత్వం పెరగడం, మిత్ర పురుగులు చనిపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
పంటల సాగులో పురుగు మందుల దుష్ప్రభావాలను అధిగమించడానికి రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి. వీటితో తక్కువ ఖర్చుతో శత్రు పురుగులను అదుపులో పెట్టుకుని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చు. సస్యరక్షణ చర్యల్లో జీవరసాయనాల వాడకం చాలా మంచి ఫలితాన్నిస్తుంది. శత్రు పురుగులను ఆశించే సూక్ష్మజీవులను ప్రయోగశాలల్లో కృత్రిమంగా పెంపొందించి వాటి నుంచి జీవరసాయనాలు తయారు చేస్తారు..
జీవరసాయనాల్లో ముఖ్యంగా..
కీటక నాశక జీవరసాయనాలు, రోగ నాశక జీవరసాయనాలు అనే రెండు రకాలున్నాయి.
కీటక నాశక జీవరసాయనాలు
వీటిని శిలీంద్రాలు, బాక్టీరియా, వైరస్, నులిపురుగుల నుంచి తయారు చేస్తారు.
శిలీంద్ర- ఆధారిత జీవరసాయనాలు
ఈ రసాయనాల్లో ఉండే శిలీంద్ర బీజాలు శత్రుపురుగులను ఆశించి, వాటిలో వృద్ధిచెంది పురుగుని చంపివేస్తాయి. మార్కెట్లో లభించే వాటిలో ముఖ్యమైనవి.
లెకానిసిల్లియం లెకాని :
పత్తి, మిరప, వంగ, బెండ, ఇతర పంటల్లో రసంపీల్చే పురుగులను, నల్లిని లెకానిసిల్లియం ఆదుపులో ఉంచుతుంది. లీటరు నీటికి 5గ్రా, చొప్పున కలిపి పిచికారి చేయాలి..
పర్పుర్యోసిల్లియం లిలాసినస్ :
ఈ జీవ రసాయనం నులిపురుగుల నివారణ కోసం వాడుకోవచ్చు. 2 కిలోల పొడి మందును 100 కిలోల పశువుల ఎరువులో కలిపి, 10-15 రోజులు నీడ ప్రదేశంలో ఉంచి, కొద్దిగా నీరు పెడుతూ అభివృద్ధి చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ప్రతి 3 నెలలకు ఒకసారి ఇస్తే నేలలోని నులిపురుగులు చనిపోతాయి.
బాక్టీరియా ఆధారిత జీవరసాయనాలు
బాక్టీరియా బీజాంశాలున్న జీవరసాయనాన్ని 'బిటి' అంటారు. బాసిల్లస్ తురింజియన్సిన్ గల ఈ మందు పంటలనాశించే లార్వా దశలపై ప్రభావం చూపుతుంది. ఎకరాకు 400గ్రా. లేదా 400 మీ.లీ. పొడి లేదా ద్రవ మందును పిచికారి చేయాలి.. దీనిలో శనగపచ్చ పురుగు, పొగాకు లద్దెపురుగు, క్యాబేజి డైమండ్ బాక్ మాత్, కత్తెర పురుగు, వంగ, బెండ పంటల్లో కొమ్మ, కాయ పురుగులను అదుపులో పెట్టవచ్చు.
వైరస్ ఆధారిత జీవరసాయనాలు
వైరస్ ఆశించిన పురుగుల నుంచి వైరస్ బీజాలను ప్రయోగశాలల్లో పెంపొందింది. మార్కెట్లో ద్రవరూపంలో అమ్ముతారు. ఇదే ఎన్.పి.వి. వైరస్. ఇది ప్రస్తుతం శనగపచ్చ పురుగు (హెచ్.ఎన్.పి.వి.), లద్దే పురుగు ఎస్.ఎల్.ఎన్.పి.వి.)గా దొరుకుతుంది. పత్తి పంటలో శనగపచ్చ పురుగు, లద్దెపురుగు నివారణకు హెచ్.ఎన్.పి.వి. లేదా ఎస్.ఎన్.పి.వి.ను 200 ఎల్.ఇ. ఎకరాకు వాడాలి. టొమాటో, ఆకుకూరలు, పొద్దుతిరుగుడు, ఇతర పంటల్లో శనగపచ్చ పురుగు నివారణకు ఎకరాకు 100 ఎల్ . పిచికారి చేసి పురుగులను అదుపులోకి తేవచ్చు. ఆముదం, ఇతర పంటల్లో పొగకు లద్దెపురుగు నివారణకు ఎకరాకు 100 ఎల్.ఇ. వాడాలి.
నులిపురుగు ఆధారిత జీవరసాయనాలు
ఈ తరహా జీవరసాయనాలు వేరు పురుగు, శనగపచ్చ పురుగు, ఇతర పురుగుల మీద ప్రభావం చూపుతాయి. ఇవి ఇంకా పరిశోధనా స్థాయిలోనే ఉన్నాయి.
రోగనాశక జీవరసాయనాలు
సూక్ష్మజీవుల నుంచి తయారైన వీటిని వివిధ పంటల్లో కాండంకుళ్ళు, దుంపకుళ్లు వగైరా రోగాల నియంత్రణకు వాడాలి. వీటిలో ట్రైకోడెర్మా.. సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ అనే రెండు రకాలు ఉన్నాయి.
ట్రైకోడెర్మా
ఇది శిలీంద్ర ఆధారిత రోగనాశని. నేల ద్వారా సంక్రమించే రోగాల నుంచి పంటను కాపాడుతుంది. మిర్చి, పత్తి, శనగ, కంది, కూరగాయల్లో వచ్చే ఎండు తెగులు, అరటి, పసుపులో దుంపకుళ్లు, కూరగాయల్లో నారుకుళ్లు వంటి రోగాల పైన ప్రభావం చూపుతుంది. ట్రైకోడెర్మాను పశువుల పేడ ఎరువులో దిగువ చూపిన విధంగా అభివృద్ధిచేసి పంటకు చేయాలి..
90 కిలోల పశువుల పేడలో 24 కిలోలు. ట్రైకోడెర్మా పొడి, 8 కిలోల వేపపిండి కలిపి నీడ ప్రదేశంలో ఉంచాలి. 10-12 రోజుల పాటు కొద్దికొద్దిగా నీరు పెడుతూ పేడను మురగనివ్వాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ఎకరంలో చివరి దుక్కిలో నేలలో వేసి కలియదున్నాలి.
ఒక లీటరు నీటిలో 10 గ్రా. ట్రైకోడెర్మాపొడిని కలిపిన ద్రావణంలో నారువేర్లను 30-40 నిమిషాల పాటు నానబెట్టి తీస్తే, పంటలో తెగుళ్ళు చాలా వరకు రాకుండా ఉంటాయి.
సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్
ఇది బాక్టీరియా ఆధారిత శిలీంద్ర నాశని దీనిని వరిలో పాముపొడ తెగులు, కాండంకుళ్లు, అగ్గితెగులు నివారణకు వాడొచ్చు. వంద కిలోల పశువుల ఎరువులో 2-4 కిలోల సూడోమోనాస్ పొడి కలిపి 10-12 రోజులు నీడ ప్రదేశంలో మగ్గపెడితే బాక్టీరియా బీజాలు మరింతగా వృద్ధి, చెంది, పంటను రోగాల నుంచి కాపాడుతాయి. ఈ మిశ్రమాన్ని ఒక ఎకరంలో చివరి దుక్కిలో వేయాలి.. కిలో విత్తనానికి 8-10 సూడోమోనాస్ పొడితో విత్తనశుద్ధి చేసి చిత్తుకుంటే హానికారక తెగుళ్లు గణనీయంగా తగ్గుతాయి. 200 లీటర్ల నీటిలో ఒక కిలో సూడోమోనాస్ పొడిని కలిపి, ఎకరా వరి పంటలో నాటిన 30, 45, 60 రోజులప్పుడు పిచికారి చేస్తే పంటకు తెగుళ్ల బెడద తగ్గి, ఆరోగ్యంగా ఉంటుంది.
బవేరియా బసియానా
దీనిని రసంపీల్చే పురుగులు (తెల్లదోమ, పేను), శనగపచ్చ పురుగు, పొగాకు లద్దెపురుగు, క్యాబేజిలో డైమండ్ బాక్మాత్, వరిలో సుడిదోమ, చెదలు, మిడతల నివారణ కోసం వాడుకోవచ్చు. లీటరు నీటికి 5 గ్రా. లేదా ఎకరాకు కిలో చొప్పున పిచికారి చేయాలి.
మెటారైజియం అనైసోప్లియే
మొక్కజొన్నలో కత్తెర పురుగు, అన్ని రకాల పంటలు నాశించే వేరు పురుగు, కొబ్బరిలో ముక్కు పురుగు, మిడతలు, రసంపీల్చే పురుగుల పైన ప్రభావం చూపుతుంది. కత్తెర పురుగు, మిడతల నివారణకు లీటరు నీటికి 5గ్రా. చొప్పున పిచికారి చేయాలి. వేరుపురుగు, కొబ్బరిలో ముక్కుపురుగు కోసం 50 కిలోల మాగిన పశువుల ఎరువులో 1-2 కిలోల మెటారైజియం పొడి కలిపి 10-12 రోజుల పాటు నీడ ప్రదేశంలో ఉంచి, తడి ఆరకుండా నీరు పెడుతూ ఉండాలి. ఇలా అభివృద్ధి చేసిన మిశ్రమాన్ని వేర్లదగ్గర చల్లుకోవాలి. ఇలా రెండుసార్లు చేసి పురుగును అదుపులో పెట్టవచ్చు.
ఏయే పేర్లతో లభిస్తాయి
ట్రైకోడెర్మా: భూమిక, సంజీవనీ, ట్రెకో-పెప్, ట్రెకోజ్, ట్రైకో పేర్లతో మార్కెట్లో లభిస్తుంది.
సూడోమోనాస్ మోనాస్, సూడో, సూడోజ్-పి, ఇకోమోనాస్, బయోషాట్ పేర్లతో లభిస్తుంది.
మెటరైజియం: మెటా, బయోస్పార్క్, బయోప్రొటెక్టర్, సమృద్ధి, దేవాస్త పేర్లతో లభిస్తుంది.
బవేరియా బసియానా; ఇది దమన్, టాక్సిన్, పెస్టిల్యూషన్, బయోపౌడర్, జీవిసైడ్, బెవరోజ్ పేర్లతో మార్కెట్లో లభిస్తుంది..
లెకానిసిల్లియం లెకాని: కిల్మిట్, బయో ఫైర్, వెర్రికాన్, వెర్డిసాఫ్ట్ విక్టర్ పేర్లతో లభిస్తుంది.
బీటీ: మహస్ర, షాక్, మైక్రో-బిటి, బాసిల్లస్-క్యూ, బయోధురి, డైపెల్, డెల్ఫిన్ పేర్లతో రైతుకి అందుబాటులో ఉంది.
ఎన్.పి.వి.: బయోకిల్, స్పోడోసైడ్, హెలిసియాన్ పేర్లతో మార్కెట్లో లభిస్తుంది.
వాడకంలో జాగ్రత్తలు
జీవరసాయనాలను ఎండ తగలని చోట దాచుకోవాలి.
వాడే ముందు, వాటి గడువు తేదీని చూసి వాడుకోవాలి.
ఎండలేని ఉదయం లేదా సాయంకాలం వేళ పొలంలో పిచికారి చేయాలి.
ఇతర రసాయన పురుగు మందుల్లో కలిపి పిచికారి చేయరాదు.
జీవరసాయనాలు కొనేటప్పుడు ప్యాకెట్ పైన రిజిస్ట్రేషన్ నెంబరు. (ప్రభుత్వం అనుమతి) ఉన్న కంపెనీలవే కొనాలి.
09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు