పుదీనా సాగు - లాభాలు




పుదీనాలో జపనీస్ పుదీనా స్పియర్ పుదీనా, పిప్పర్మెంట్ పుదీనా, బర్గామెట్ పుదీనా అనే రకాలో భార దేశంలో జపాన్ పుదీనాకు గిరాకీ ఉంది. దీని తైలాన్ని సుగంధ పరిమళాలు, పాన్ మసాలాలను, దగ్గు జలుబు, నొప్పులు తగ్గించే ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు. అంతేగాక టూత్ పేస్టులు, మౌత్ వాష్ చూయింగ్ గమ్ మొదలగు వాటిలో పుదీనాను వాడుతున్నారు.

పుదీనా 60-75 సెం.మీ. పెరిగి అనేక కొమ్మలతో కూడిన బహువార్షిక పొద. అనువైన వాతావరణం ఉన్న నేలల్లో 100 సెం.మీ. వరకు ఎత్తు పెరుగుతుంది. దీని ఆకులు 5-15 సెం.మీ. వరకు వెడల్పు ఉండి సన్నని నూగును కలిగి ఉంటుంది. ఈ నూగులో ఉన్న నూనె గ్రంథుల్లో మనకు ఉప యోగపడే తైలం తయారవుతుంది. తైలం నాణ్యత అందులో ఉన్న మెంథాల్ అనే పదార్థం మీద ఆధారపడి ఉంటుంది.



రకాలు: శివాలిక్, కోసి, హిమాలయ, సక్షమ్, కుషాల్ అను రకాలు జపాన్ పుదీనాలో ముఖ్యమైనవి

శివాలిక్, కోసి, హిమాలయ రకాలు ఆకుపచ్చ, తుప్పు తెగుళ్లను తట్టుకోలేవు. అందువల్ల ఇప్పుడు వీటిని ఎక్కువగా సాగుచేయడం లేదు

సక్షమ్: పిలకలు నాటడం ద్వారా ఈ రకం నుంచి హెక్టారుకు 80 శాతానికి పైగా మెంథాల్ కలిగిన 225-250 కిలోల తైలాన్ని పొందవచ్చు

కుషాల్: ఈ రకం రబీ చివరలో కూడా నాటడానికి అనుకూలం. అంటే వరికోత ఆలస్యమైనప్పుడు కూడా వరి తర్వాత ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు. 90 నుండి 100 రోజుల పంట వ్యవధిలోనే హెక్టారుకు 80శాతం మెంథాల్ కలిగిన 175-200 కిలోల తైలాన్ని పొందవచ్చు. సక్షమ్, కుషాల్ రెండు కూడా పురుగులు, తెగుళ్లను తట్టుకోగలవు. అందువల్ల ఇవి ఎక్కువగా సాగు చేస్తున్నారు.

నేలలు: అధిక సేంద్రియ పదార్థం కలిగిన ఎర్రనేలలు, నీరు నిల్వని నల్లనేలలు, ఉదజని సూచిక 6, 5–8.5 ఉన్న నేలలు అనుకూలం. ఆమ్ల, క్షార భూములు సాగుకు అనుకూలం కాదు.

వాతావరణం: సమశీతోష్ణస్థితి నుంచి ఉష్ణ వాతావరణ పరిస్థితులు పుదీనా పెరుగుదలకు అనుకూలం. 100-110 సెం.మీ. వర్షపాతం, 20-40 డిగ్రీ సెం.గ్రే. ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలు సాగుకు అత్యంత అనుకూలం.

ప్రవర్ధనం: దీనిని వేర్లు, కాండపు ముక్కలు, పిలకల ద్వారా వ్యాప్తి చేస్తారు. ఎకరానికి 3,4 క్వింటాళ్ల తీగ మొక్కలు అవసరమవుతాయి.



నాటే పద్దతులు: పుదీనాను రెండు రకాలుగా పెట్టుకోవచ్చు

జనవరి నుంచి ఫిబ్రవరి 15 వరకు నాటుకోవాలంటే పిలకలను పొలంలో నాటుకోవచ్చు. వరసకు వరసకు మధ్య 60 సెం.మీ., మొక్కల మధ్య 10 సెం.మీ. ఉండేలా చూసుకోవాలి పిలకలను కుల్ఫీలతో మట్టితీసి 5-6 సెం.మీ. లోతులో లేదా ట్రాక్టరుతో గొర్రు తోలడం ద్వారా సెం.మీ.3 లోతులో నాటుకోవాలి. తర్వాత వాటిని పూడ్చాలి. వెంటనే తడి ఇవ్వాలి. జనవరిలో నాటుకోంటే 3-4 వారాల్లో, ఫిబ్రవరిలో అయితే 2-3 వారాల్లో మొలకలు వస్తాయి.

2. ఫిబ్రవరి 15 తర్వాత నాటుకోవాలంటే పిలకలను ముందుగా 100 చ.మీ. నారుమడిలో పెంచుకొని ఆరు ఆకులు వచ్చిన తర్వాత 30×10 సెం.మీ దూరంతో ప్రధాన పొలంలో నాటుకోవాలి

3. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు పుదీనా నాటుకోవాలంటే ఈ పద్ధతి మేలు. అంటే ప్రకాశం జిల్లాలో అయితే రబీ సెనగ పంట తర్వాత కూడా ఈ పుదీనాను సాగు చేయవచ్చు. రబీ వరి లేదా శనగ పంటలు కోసిన తర్వాత బాగా 2-3 సార్లు దుక్కి దున్ని, చిన్నమడులు తయారుచేసుకొని వాటిని వరి నాటువేసే సమయంలో లాగా నీటితో నింపాలి. నారుమడి నుంచి ఆరు ఆకులు వచ్చిన మొక్కలను పీకి వరి నారు మడులు నాటుకొనేటట్ల యితే వరుసల మధ్య 50-60 సెం.మీ., మొక్కల మధ్య 10-15 సెం. మీ ఉండేలా నాటుకోవాలి. అదే ఏప్రియల్లో అయితే 45-10 సెం.మీ. దూరంలో నాటుకోవచ్చు. హెక్టారుకు సుమారు 2.5 లక్షల పిలకలు నారు అవసరం. ఈ పద్ధతిలో నాటితే కుషాల్ రకాన్ని ఉపయోగించడం మంచిది. నీరు అధికంగా నిలువ ఉండే నేలల్లో అయితే పిలకలను బోదెల మీద నాటుకోవాలి .

ఎరువులు: సమగ్ర పోషక యాజమాన్యం అనగా సేంద్రియ, రసాయన ఎరువులను సమ్మిళతంగా ఉపయోగించడం వల్ల ఆకులు, మెంథాల్ పదార్థాల దిగు బడి ఎక్కువ వస్తుంది. ఆఖరి దుక్కిలో 20-30 టన్నుల పశువుల ఎరువు, 110 కిలోల యూరియా, 310 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 67 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకొని కలియదున్నాలి. నాటిన 30-40 రోజులకు, 65-70 రోజులకొకసారి 55 కిలోల చొప్పున యూరియాను పైపాటుగా వేసుకోవాలి. అదేవిధంగా మొదటి కోతకోసిన వెంటనే ఒకసారి, 30-35 రోజులకు రెండోసారి 55 కిలోల చొప్పున యూరియా పైపాటుగా వేసుకోవాలి. పైపాటుగా యూరియాను వేయడం కుదరకపోతే 2 శాతం యూరియా ద్రావణం (20గ్రా. యూరియాను లీటరు నీటిలో కలిపి) ద్రావణాన్ని పిచికారి చేసుకోవచ్చు. 2శాతం ఇనుము, జింక్ సల్పేట్లను పిచికారి చేయడం ద్వారా మరింత దిగుబడులు పొందవచ్చు.

నీటి యాజమాన్యం: జనవరి, మార్చి నెలల మధ్య రెండు వారాలకోసారి తడి ఇవ్వాలి. ఏప్రిల్, జూన్ మాసాల్లో అయితే ప్రతి 7-10 రోజుల వ్యవధితో నీటి తడులు తప్పనిసరిగా ఇవ్వాలి. సాళ్లలో 5 టన్నుల పచ్చి ఎండు ఆకులు కప్పి ఉంచడం (మల్చింగ్) ద్వారా 25 శాతం నీటిని ఆదా చేయడమే గాక కలుపు పెరగకుండా చేసి వేసవిలో నేల ఉష్ణోగ్రతను తగ్గిం చడంతో పాటు ఆకుల సత్తువ, సేంద్రియ పదార్థం నేలకు అందుతుంది

కలుపు తీయడం: సరైన సమయంలో కలుపు నివారణ చేపట్టకపోతే 70 శాతం దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి పిలకలు నాటే పద్ధతి అయితే నాటిన 45, 65, 80 రోజుల తర్వాత మనుషులతో కలుపు తీయించాలి. మళ్లీ పంట మొదటి కోత తర్వాత 30-45 రోజులకు రెండోసారి కలుపు తీయాలి.

అంతర పంటలు: ప్రతి రెండు వరుసల పుదీనాకు ఒక వరుస మినుము కంది లేదా అలసందలు (బొబ్బర్లు) వేసుకోవడం ద్వారా అధిక ఆదాయం పొందడమేగాక ఈ పంటల వేర్లు నేలకు నత్రజనిని అందిస్తాయి. అదేవిధంగా మల బారు వేప, శ్రీగంధం వంటి తోటల్లో పుదీనాను అంతరపంటగా సాగుచేయటం ద్వారా రూ.15వేల నుంచి 20వేల వరకు అదనపు ఆదాయం పొందవచ్చు.



కోత: పిలకలు నాటుకుంటే (జనవరి - ఫిబ్రవరి 15 వరకు) 100 రోజుల్లో (మేలో) పంట మొదటి కోతకు సిద్ధంగా ఉంటుంది. తదుపరి ప్రతి 80-70 రోజు లకు కోతలు కోసుకోవచ్చు. రెండు లేదా మూడు కోతల తర్వాత తీసివేసి మళ్ళీ నాటుకోవాలి. అదే నారు ద్వారా నాటుకొనే పంట (మార్చి, ఏప్రిల్) అయితే జూన్-జులైలో ఒకేఒక కోత కోసుకోవచ్చు. అడుగున ఉన్న ఆకులరంగును బట్టి కోత మొదలు పెట్టవచ్చు. అడుగు ఆకులు పసుపు రంగుకు మారుతుంటే వెంటనే కోయాలి. దిగుబడి: హెక్టారుకు 20-40 టన్నుల ఆకులు దిగుబడి వాటినుంచి 125-200 కిలోల తైలం దిగుబడి వస్తుంది

సస్యరక్షణ :-

పురుగులు: ఆకు చుట్టు పురుగులు, పెంకు పురుగులు, బొంత పురుగులు ఆశించి ఆకులును నాశనం చేస్తాయి. వీటి నివారణకు మలాథియాన్ మందును 2 మి.లీ. లీటరు నీటికి చొప్పున ఒకటి, రెండు సార్లు పిచికారి చేసుకోవాలి. తెగుళ్లు: పిలక, వేరుకుళ్ళు, ఆకుమచ్చ, వడలు తెగులు కనిపిస్తే కార్బెండాజిం 1 గ్రా. లేదా మాంకోజెబ్ 2.5 గ్రా. లేదా బ్లైటాక్స్ 3 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. జనవరి- ఫిబ్రవరిలో నాటిన పంటకు బూడిద తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. నివారణకు 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు నీటిలో కరిగే గంధకాన్ని 2 గ్రా./ లీటరు నీటికి చొప్పున కలపి పిచికారి చేయాలి. అదేవిధంగా హెక్టారుకు 500 కిలోల వేప పిండి, రెండు కిలోల కార్బోప్యూరాన్ 3జి. గుళికలు వేసుకోవడం ద్వారా పంటను నులిపురుగుల బారినుంచి కాపాడుకోవచ్చు

తైలం తీసే పద్దతి: పంట కోసిన తర్వాత 4-5 గంటలు నీడలో ఆరబెట్టి నూనె బట్టీలో వేసి స్వేదన ప్రక్రియ ద్వారా నూనె తీయాలి. దీనికోసం బట్టీ తొట్టి (బాయిలర్), ద్రవీకారి ( కండెన్సర్), సంగ్రహపాత్ర (సెపరేటర్) కలి గిన యంత్రం అవసరం. కోసి ఆకులు బట్టి తొట్టిలో నిండా నింపి మూతమూసి నీటిఆవిరి పంపాలి ఇలా చేయడం వల్ల ఆకుల్లోని నూనె గ్రంధులు పగిలి నూనె ఆవిరి, నీటి ఆవిరి కలిసి ద్రవీకారిలోకి ప్రవేశించి చుట్టూ ఉన్న నీటివల్ల ద్రవీభవించి చుక్కల రూపంలో సంగ్రహ పాత్రలోకి ప్రవేశిస్తుంది. తైలాన్ని వేరుచేసి, శుభ్రపరచి అల్యూమినియం లేదా గాజు పాత్రలో భద్రపరుచుకోవాలి. ఈ పక్రియ మొత్తం పూర్తి కావడానికి 4 గంటల వ్యవధి పడుతుంది...





Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు