గ్రీన్ హౌస్ లలో ఆకుకూరల సాగు - లాభాల పంట

 


వాతావరణ పరిస్థితులను స్వల్పంగా లేదా పూర్తిగా నియంత్రించేందుకు సుమారు 200 మైక్రాన్లు లేదా 800 గేజి యు.వి. స్టెబిలైజ్డ్ పాలిథీన్ ఫిల్మ్ సపోర్టింగ్ కట్టడాలతో చేసే నిర్మాణాలను హరితగృహాలు అంటారు.


 తెలంగాణలో ప్రస్తుతం ఇవి సుమారు వెయ్యి ఎకరాలకు మించి ప్రభుత్వ సబ్సిడీ విధానం ద్వారా రైతుస్థాయిలో సాగులో ఉన్నాయి. హరితగృహాలలో ముఖ్యంగా ఎక్కువ ధర పలికే పంటలైన కాప్సికం, జర్బెరా, చెర్రీ, టొమాటో, కీర, గులాబీ, చామంతులు, కార్నేషన్, ఆర్కిడ్స్ వంటి పూలు, కూరగాయలు సాగు చేస్తున్నారు.



సమస్యలు


హరితగృహాలలో సాగుచేస్తున్న రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అవి


1. అధిక మొత్తంలో పంటకు ఖర్చవుతుంది. ఎక్కువ శాతం విత్తనాలు దిగుమతి చేసుకున్నవి లేదా హైబ్రిడ్స్ వాడటం వల్ల విత్తనానికి అధికంగా ఖర్చు పెడుతున్నారు.


హరితగృహాలలో వాతావరణం ఉష్ణోగ్రతలు, తేమ శాతం సరిగా యాజమాన్యం చేయలేక ఇబ్బందులు పడుతున్నారు.


 హరితగృహాల్లో సరైన పద్ధతిలో శుభ్రత, రక్షణ కల్పించకపోవడం వల్ల చీడపీడల తీవ్రత అధికంగా ఉంటుంది.


ఎప్పటికప్పుడు నివారణ చర్యలు చేపట్టకపోవడం హరితగృహాల తలుపులు తెరచి ఉంచడం వల్ల చీడ, పీడలు (రసంపీల్చే పురుగులు) అత్యధిక మోతాదులో వృద్ధి చెంది, వైరస్ తెగుళ్లు వ్యాపించి తీవ్ర నష్టం వాటిల్లుతుంది.


నీరు, పోషకాల యాజమాన్యంలో అసమానతల వల్ల పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి.




ఆకుకూరల సాగు


 దీర్ఘకాల పంటల వల్ల హరితగృహాల యాజమాన్యం ఖర్చు పెరుగుతుంది.  ఒక్కోసారి పండించిన పంటలకు తక్కువ సంఖ్యలో వినియోగదారులు ఉండటం వల్ల పంటకు తక్కువ విలువ ఉంటుంది. రైతులు అధికంగా ఖర్చుపెట్టి సాగుచేసిన పంటల వల్ల అధికంగా నష్టపోతున్నారు.


పాటించాల్సిన మెలకువలు ఏ పంటల ఎంపికలో స్వల్పకాలిక పైర్లకు ప్రాధాన్యమిస్తే సాగు ఖర్చు తక్కువవుతుంది.


పండించే పంటకు అధిక మొత్తంలో వినియోగదారులు ఉండాలి. అనగా ఎక్కువ మంది, ఎక్కువ మోతాదులో ఆ పంటను వినియోగించాలి. సంవత్సరం పొడవునా ఈ పంట ప్రతి గృహంలో వినియోగంలో ఉండాలి.


అన్ని రకాల నేలలకి అనువైన పంటలను ఎన్నుకోవాలి. స్వల్పకాలిక పంటలు, మిశ్రమ పంటలు, సాగుచేయటం వల్ల నికరాదాయం పెరుగుతుంది.


పై విషయాలన్నీ గమనిస్తే ప్రస్తుతం అధిక పోషకాలనిచ్చే ఆకుకూరలైన పాలకూర, కొత్తిమీర, చుక్కకూర, పుదీన వంటి వాటిని ప్రతికూల పరిస్థితులైన వర్షాకాలం, వేసవికాలాల్లో పండిస్తే అధిక ధరలతో పాటు స్వల్పకాలంలో రైతులు ఆదాయం పొందవచ్చు.


పాలీహౌస్ లో ఆకుకూర సాగు



ప్రతికూల పరిస్థితుల్లో (వేసవి కాలం, వర్షాకాలం) ఆకుకూరలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంటుంది గనుక పాలిహౌస్లలో ఆకుకూరలు సాగుచేసి అధిక లాభాలు పొందవచ్చు.


వాతావరణం: పగటి ఉష్ణోగ్రత సుమారు 21-27 డి. సెం.గ్రే., రాత్రి ఉష్ణోగ్రత సుమారు 18-20 డి. సెం.గ్రే., గాలిలో తేమ 60-65 శాతం ఉండేలా కోవాలి.


నేల స్వభావం: ఉదజని సూచిక 5.5 నుంచి 7.5, లవణాల సాంద్రత 2 మిల్లీమోస్/ సెం.మీ. కన్నా తక్కువ ఉండాలి. సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.


ఎత్తయిన మడుల తయారీ



బెడ్ల తయారీలో సుమారు 1.5 టన్నుల పశువుల ఎరువు, 100 కిలోల వేపపిండి, 2 క్వింటాళ్ల వర్మికంపోస్టు చొప్పున 1000 చ.మీ. పాలీహౌసికి వేసుకోవాలి. 90 సెం.మీ. వెడల్పు, సుమారు 10-15 సెం.మీ. ఎత్తుగల బెడ్లను (ఎత్తయిన మడులను తయారు చేసుకోవాలి. ఈ మడులపైన ఆకుకూరల విత్తనాలను వరుసల్లో లేదా పలుచగా చల్లుకొని, మట్టితో కప్పి, డ్రిప్ పైపులను అమర్చుకోవాలి.




కలుపు యాజమాన్యం


అవసరానుగుణంగా ఒకటి, లేదా రెండుసార్లు కలుపు తీయాలి. పంట మొలకవచ్చిన వారం నుంచి పది రోజులు కలుపు తప్పనిసరిగా నివారించాలి.

ఎరువుల వాడకం సేంద్రియ పద్ధతిలో జీవామృతం, పంచగవ్య వంటి వాటిని వాడుకోవాలి. నీటిలో కరిగిపోయే 19-19-19 ఎరువును సుమారు ఒకటి నుంచి ఒకటిన్నర కిలోల చొప్పున వెయ్యి చ.మీ. పాలీహౌసికి వారానికి ఒకసారి బిందు సేద్యం ద్వారా అందించవచ్చు. సూక్ష్మపోషక లోపాలకు మ్యాక్ 2గ్రా. లేదా స్వర్ణపుల్ 1 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయవచ్చు. సస్యరక్షణ: ఆకుకూరలు త్వరగా పంటకొస్తాయి గనుక సస్యరక్షణకు ఎక్కువ ఖర్చుండదు. రసంపీల్చే పురుగులు ఆశిస్తే అజాడిరక్టిన్ 1500 పి.పి.ఎం.ను 5 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.


సస్యరక్షణలో సూక్ష్మజీవుల మిశ్రమం (ట్రైకోడెర్మా, సూడోమోనాస్, మెటారైజియం, పాసిలోమైసిస్, అజటోబాక్టర్, పాస్పోబాక్టీరియా, పొటాష్ బాక్టీరియా, వర్టిసీలియం మొదలైనవి)ను పశువుల ఎరువులో వృద్ధిచేసి వేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.




కొత్తిమీర సాగువల్ల స్వల్పకాలంలో ఆదాయం పొందడమే కాకుండా పంటకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. ఎక్కువ పంటలు పండించుకునే అవకాశం రైతుకు ఉంటుంది..







Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు