తెలంగాణలో పత్తి పంటకు భారీ నష్టం - రబీ సీజన్లో పత్తి సేద్యం కోసం దృష్టి సారిస్తున్న రైతులు

 



 తెలంగాణలో వరి స్థానంలో పత్తి సేద్యం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సలహా మేరకు ఈసారి పత్తి సేద్యం 75 లక్షల ఎకరాలకు విస్తరించగలదని భావిస్తున్నారు. ఇందులో ఇప్పటి వరకు 43 లక్షల ఎకరాలకు విస్తరించగా ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు 20 శాతం మేర పంటకు నష్టం వాటిల్లింది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో పొలాలలో పత్తి మొక్కలు నీట మునిగాయి. తద్వారా మరోసారి విత్తేందుకు విత్తన ఖర్చుల కోసం రైతులు సతమతమవుతున్నారు. అంతేకాకుండా ఆలస్యంగా విత్తిన పంట దిగుబడులు క్షీణించడమే ఇందుకు ప్రధాన కారణం. 


జూలై చివర మరియు ఆగస్టు మొదట్లో పత్తి సేద్యం చేపట్టేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా సిఫారసు చేయరు. ఎందుకనగా, పత్తి రాబడులు సాధారణంగా అక్టోబర్లో ప్రారంభమై డిసెంబర్ వరకు కొనసాగుతుంటాయి. గత వారం రెండు రోజులుగా కురిసిన కుండపోత వర్షాలకు దాదాపు 11 లక్షల ఎకరాలలో ఖరీఫ్ పంటలకు తీరని నష్టం వాటిల్లింది. ఇందులో అత్యధికంగా పత్తి పంటతో పాటు వరి, మొక్కజొన్న, సోయాచిక్కుడు పంటలకు నష్టం వాటిల్లినట్లు సంకేతాలు అందుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్ మరియు ఇతర జిల్లాలలో దాదాపు 8.60 లక్షల ఎకరాలలో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. ప్రత్యామ్నాయ పంటల సేద్యం చేపట్టేందుకు అన్నదాతలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకనగా తెలంగాణలో ప్రతియేటా ఇస్తున్న రైతుబంధు ప్రణాళిక కింద ఇస్తున్న సాయానికి అదనంగా మరే సాయమూ అందించడంలేదు.


రబీ సీజన్లో పత్తి సేద్యం కోసం దృష్టి సారిస్తున్న రైతులు


  భారీయెత్తున పత్తి సేద్యం చేపట్టేందుకు అధిక సాంద్రత కలిగిన వ్యవసాయ వ్యవస్థ (హెచ్ఐపిఎస్) కు చేయూతనివ్వడంతో పాటు ఖరీఫ్ సీజన్లో పాటు రబీ సీజన్లో కూడా పత్తి సేద్యం చేపట్టేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు ప్రారంభించింది. గతంలో అమెరికాలోని టెక్సాస్ ఆస్టిన్ ప్రాంతంలో పర్యటించినప్పుడు రైతులు తమ పొలాలలో 44 సెంటీగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ పత్తి పండిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తమ నివాసంలో విలేఖరులకు తెలిపారు. అమెరికా మరియు బ్రెజిల్ లాంటి దేశాలలో ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో కూడా పత్తి సేద్యం చేపట్టే అవకాశం ఉంది. తెలంగాణలో పత్తి సేద్యం ఒక కోటి ఎకరాలకు విస్తరించవచ్చని మంత్రి పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు త్వరలో తాము చేపట్టిన అధ్యయనం నివేదికను ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుకు సమర్పించనున్నారు. తదుపరి ఈ అంశంపై విస్తృస్థాయి సమావేశం నిర్వహించనున్నారని కూడా ఆయన అన్నారు.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు